వచ్చిన తరువాత మొదటి శనివారం మెరీనా బీచ్‌కి వెళ్లి సముద్రాన్ని చూద్దామని అనుకున్నాం. అయితే మొదటిసారిగా సముద్రమంటే నీళ్లతోనే కాకుండా జనాలతో కూడా తయారవుతుందని ప్రత్యక్షంగా చూసాం. శనివారం, ఆదివారాలు మాలానే ఇంకా చాలా మంది అనుకుంటూ ఉంటారని అక్కడికి వెళ్లిన తరువాత తెలిసింది. అప్పటికీ పట్టువదలని విక్రమార్కుల్లాగా సముద్రాన్ని చూద్దామని సముద్రపు ఒడ్డున ఉండే ఇసకమీద అలా నడుస్తూ నడుస్తూ నడుస్తూ చివరికి నీళ్ల దగ్గరకు చేరుకునే సరికి చీకటి పడిపోయింది. మొత్తానికి, ఇలాంటి ఇంకో సాయంత్రం అవుతుందని వెళ్లిన మాకు చాలా పెద్దనిరాశ.
అలా కొన్ని రోజులపాటు ఎటూ వెళ్లకుండా, కొన్ని రోజుల తరువాత మళ్లీ ఏదో ఒక సముద్రపు బీచ్‌కి, అదీ జనాలు లేని బీచ్‌కి వెల్లాలని బాగా ప్లానేసి, స్కెచ్చుగీసి, చెన్నై నుండి 30కీమీల దూరంలో ఉండే మహాబలిపురం వెళ్లాలని నిర్ణయించాం. సాయంత్రమైతే చాలా మంది ఉంటారని, మధ్యాహ్నం అయితే ఎవరూ ఉండరని 10:30 కి బయలుదేరి 12 కల్లా అక్కడికి చేరుకున్నాం. ఒక గంట పాటు అక్కడ ఉన్న గుడిని, దాన్ని చూడటానికి వచ్చిన టూరిస్టులను చూసి, కొన్ని ఫొటోలు కూడా దిగేసాం.
తరువాత ఆ గుడికే ఆనుకుని ఉండే సముద్రం దగ్గరకు వెళ్లాం. మిట్ట మధ్యాహ్నం ఒంటి గంటకు కూడా అక్కడ ఇంత మంది ఉంటారని ఏమాత్రం ఊహించలేదు. కాకపోతే మెరీనా బీచ్‌కంటే ఇది చాలానయం.
మొన్నామధ్య సునామీ వచ్చినప్పుడు ఈ గుడి కూడా మునిగి పోయినట్టుంది, ఈ సారి గుడికేమీ జరగ కూడాదని, ఆ గుడికీ, దాని వెనుక ఉండే సముద్రానికీ మధ్యన పెద్ద పెద్ద బండరాళ్లతో నింపేసారు.
తరువాత అక్కడున్న బండరాళ్ల మీద చాలా సేపు కూర్చుని, సముద్రపు అలలు వచ్చి ఈ బండరాళ్లను ఢీకొట్టటం చూస్తూ కూర్చున్నాం.
---
ప్రస్తుతానికి "తమిళ్ తెరియాదు" అనే వాక్యాన్ని నేర్చుకున్నా. అదేంటో గానీ ఆ వ్యాక్యాన్ని ప్రయోగించిన ప్రతీసారీ ఎదుటోళ్లు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా ఏదో అరిచేస్తూ ఉంటారు... నేను తరువాత ఇంగ్లీషులో ఏదో మాట్లాడతాను, తరువాత వాళ్లు తమిళంలో ఇంకేదో మాట్లాడతారు. ఇదంతా కాదని చివరికు సైగలతోనూ, ఏకపద వాక్యాలతోనూ నెట్టుకురావడం మొదలుపెట్టా.
ఇదే క్రమంలో మొన్నమధ్య దశావతారం సినిమాని తమిళంలో చూసా. సినిమా నాకు బానే అనిపించింది, కాకపోతే ఇంటర్వెల్ తరువాత వచ్చే అసిన్ పాత్రను కట్ చేసేసి అవతల పారేస్తే బాగుండేదనిపించింది; ఏంటో మరి ఆ పాత్రను మొదటిసారిగా చూపించే పాటలో తప్ప తరువాతంతా ఏదేదో అరుస్తూనే ఉంటుంది, చిరాగ్గా...




9 వ్యాఖ్యానాలు: