కొన్ని నెలల క్రితం బ్లాగ్‌షేర్స్ అనే సైటులో నా బ్లాగులో షేర్లను అమ్మకానికి పెట్టి నేను నా మొటమొదటి షేర్ల వ్యాపారాన్ని మొదలు పెట్టాను. అక్కడ డబ్బు తప్ప మిగతాదంతా నిజంగానే జరుగుతుంటుంది. ఆ రకంగా కొన్ని రోజులు అక్కడ షేర్ల ఆట ఆడాను. అలా అక్కడ వేరే బ్లాగులలో షేర్లను కొంటూ అమ్ముతూ ఉంటే కొన్ని రోజులకు నా బ్లాగులో నా దగ్గర ఉన్న వాటాకంటే ఎక్కువ వాటాను ఇంకోడెవడో కొట్టేసాడు. నా బ్లాగు నాకు కాకుండా ఇంకోడెవడి దగ్గరో ఉండటమేమిటని (అప్పటికి ఆ సైటు బోరుకొట్టటం మొదలైయింది), ఆ సైటుకు వెళ్లటం మానేసాను. 1000 బ్లాగు డాలర్లతో మొదలు పెట్టి ఆరేడు నెలల్లో సుమారు 500,000 బ్లాగు డాలర్లు సంపాదించానక్కడ :) (అయితే అక్కడ బ్లాగు డాలర్లలో కొంత మంది ఆస్తి 13-14 అంకెలలో ఉండేది).ఈ మధ్య కాలంలో "నిజమైన" స్టాకు మార్కెట్టును గమనించటం లేదా అందులో పెట్టుబడి పెట్టడం అనే ఒక కొత్త వ్యాపకం మొదలుపెట్టాను. ఇక్కడ కొనటం అమ్మటం ఎంత నిజమో డబ్బులు పోవటం రావడం కూడా అంతే నిజం! నేను స్టాకు మార్కెట్టుకి కొత్త కాబట్టి పెట్టుబడి పెట్టేబదులుగా వాటి హెచ్చుతగ్గులు పరిశీలిస్తున్నాను. అందుకుగాను ఒక నాలుగైదు షేర్లను ఎంచుకుని వాటిని పరిశీలించటం మొదలు పెట్టాను. వాటి హెచ్చుతగ్గులు పరిశీలిస్తుంటే నా చిన్న బుర్రలో ఉన్న లాజిక్కుకి అందనివి ఏవేవో జరిగిపోతున్నాయక్కడ...
ఉదాహరణకు ఒక "క", "చ" అనే రెండు కంపెనీల షేర్లను తీసుకుందాం. రెండు కంపెనీల షేర్లూ పెరుగుతుతున్నాయి. అంతా బాగానే ఉందికదా అనుకుంటూ వాటి తీరుతెన్నులు పరిశీలించాలని అనుకున్నాను, అప్పుడే గమనించాను "చ" అనే కంపెనీ షేర్లను అమ్మే వాళ్ళకంటే కొనేవాళ్లు ఎక్కువ మంది ఉన్నారు, ఇలాంటప్పుడు దాని షేరు విలువ పెరగటం సహజం. అయితే "క" అనే కంపెనీ స్టాకులను కొనేవారి కంటే అమ్మేవాళ్ళు 3-4 రెట్లు ఎక్కువమంది ఉన్నారు, అయినా దాని విలువ ఆ రోజంతా పెరుగుతూనేఉంది. అంతేకాదు "చ" కంటే "క" విలువ బాగా పెరిగింది ఆ రోజు. దీని బట్టి కంపెనీ షేర్ల విలువలు కొనటం/అమ్మటం మీద మాత్రమే ఆధారపడవని తెలుసుకున్నాను. మరింకా వేటిమీద ఆధారపడతాయనే ఇంకో పెద్ద ప్రశ్న మిగిలిపోయింది :(
సరే ఇంక ఇక్కడ చర్చించుకోదగ్గ ఇంకో విషయం ఏమిటంటే ప్రతి 5 నిమిషాలకొకసారి refresh బట్టన్ని నొక్కి షేరు విలువ ఎంత పెరిగిందో చూసుకోవటం మొదలు పెట్టాను. కూడలిని కూడా ఇన్నిసార్లు నేనెప్పుడూ refresh చేయలేదు!... ఇంకా ఏ షేర్లనూ కొనకుండానే ఇంతలా ప్రతీ ఐదు నిమిషాలకొక సారి చూస్తున్నానంటే మరి వందల సంఖ్యలో షేర్లను కొని అమ్మేవారి పరిస్తితి ఎలాగుంటుందో!... లేక కొత్తొక వింత, అన్నట్లు స్టాకు మార్కెట్టు క్లబ్బులో కొత్తగా జేరిన వాళ్లే ఇలాంటి విపరీతమైన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారా?...
ఇదంతా అయిన తరువాత ఇంక పరిశీలించింది చాలనుకుని, ధైర్యం చేసి నా "బిగినర్స్ లక్కు"ను పరీక్షించుకుందామని అంతకుముందు తగ్గి ఇప్పుడు పెరుగుతున్న రెండు కంపెనీల షేర్లను తలా మూడు కొన్నాను... తీరా కొన్న ఐదు నిమిషాలలోనే షేరుకి ఐదు శాతం చప్పున వాటి విలువ పడిపోయింది... స్టాకు మార్కెట్టులో కనీసం "బిగినర్స్ లక్కు" కూడా పని చేయదని ఇంకో పాఠాన్ని నేర్చుకున్నాను. ఇప్పుడు వాటిని వదిలించుకుందామని ప్రతీ రెండు నిమిషాలకోసారి వాటి విలువలోని హెచ్చుతగ్గులను పరిశీలించటం మొదలు పెట్టాను...




11 వ్యాఖ్యానాలు: