అలగర్‌కోవిల్ తమిళనాడులో ఉన్న పురాతన దేవాలయాలలో ఒకటి, ఇది అలగర్ అనే కొండపైన ఉంటుంది. కొండ కింద ఒక గుడి, పైన రెండు గుళ్లు ఉంటాయి. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి సాయంత్రం 5 అయిపోయింది. కింద ఉన్న గుడికి మరమత్తులు చేస్తున్నారు. కొండమీద ఉండే గుడికి రోడుమార్గం ఉంటుంది. మేము మాత్రం ఆ రోడ్డుకు ఆనుకుని ఉండే అడవిమార్గంలో నడుచుకుంటూ కొండ మీదకి వెళ్లటానికి నిశ్చయించుకున్నాము. (అసలు అలా trekking చేయొచ్చన్నే అక్కడకు వెల్లాము)

ఈ బావి అడవిదారి మొదట్లోనే కనపడుతుంది. ఇక్కడిదాకా రావాలంటే కొండ కింద ఉన్న గుడి లోపలకు వెళ్లి, కొండకు గుడికి అడ్డంగా కట్టిన పెద్ద గోడలో ఉన్న ఒక చిన్న ద్వారం గుండా వెళ్లాలి.


వర్షాకాలం అవ్వటం వళ్లనేమో అడవి చాలా దట్టంగా ఉంది, మేము బస్సులో కొండను చేరుకునే వరకూ వర్షం పడుతూనే ఉండటం వలన నేలంతా తడి తడిగా ఉంది.

అలా అడవిమార్గంలో కొంత దూరం నడిచిన తరువాత రోడ్డు ఇలా రోడ్డు కనపడింది. అడవిలోనే వెళ్లటానికి మాకు ఇంక దారి కనపడలేదు. సరే అని ఇంక రోడుమార్గంలోనే మిగతా కొండ ఎక్కడం మొదలు పెట్టాము.

అలా నడుస్తూ నడుస్తూ నడుస్తూ ...

సుమారు గంటన్నర నడక తరువాత ఇలా కొండపైన ఉన్న గుడి ఆనవాలు కనపడింది. ఇక్కడ కొండపైన ఉండే మొదటి గుడి ఉంటుంది. ఇక్కడి నుండి ఇంకో 10-15 నిమిషాలు నడిస్తే రోడ్డు అంతమయ్యి ఇంకో గుడి ఉంటుంది. ఈ రెండో గుడిని చత్తాచెదారాన్ని పేర్చడానికి వాడుతున్నారా అని అనిపిస్తుంది.
అలా కొండపైవరకూ వచ్చిన తరువాత అక్కడ ఏంచేయాలో తోచక మళ్లీ కిందకు దిగటం మొదలుపెట్టాము. ఈ కొండ నిండా బోలెడన్ని కోతులు ఉంటాయి, అవి మన దగ్గర ఉన్న సంచీలలో ఏవయినా తినుబండారాలు ఉన్నాయేమోనని వాటిని లాక్కోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి, కాబట్టి మీరు ఎప్పుడయినా ఇక్కడికి వెళ్ళినప్పుడు వాటితో జాగ్రత్తగా ఉండండి.

కొండమీద నుండీ దిగుతున్నప్పుడు ఇలా ఒక జంట కనపడితే కెమెరాతో ఒక క్లిక్కు క్లిక్కాను. జంట ఎక్కడా కనపడటంలేదంటారా :) అయితే ఫొటో అసలు సైజులో వెతకండి కనపడుతుందేమో.


కొండదిగుతున్నపుడు కనిపించిన ప్రకృతి దృశ్యాలు.
తరువాతి రోజు పెళ్లిలో సాంబారులో అన్నం కలుపుకు తినేసి, మధురైలోనే ఉండే నాయక్ మహల్ చూడటానికి వెల్లాము. 17వ శతాబ్ధంలోనే అంత పెద్ద భవనాన్ని కట్టడం ఒక ఎత్తయితే పైకప్పుతో సహా భవనం మొత్తాన్ని ఇటుకలూ సున్నంతోనే కట్టేసారు, అయినా ఇంకా చెక్కుచెదరలేదు.

ప్రస్తుతం మహలులో ఒక దర్బారు, ఆసనం, దర్బారు చుట్టూ ఒక వరండా కొన్ని చిన్న చిన్న గదులూ మిగిలి ఉన్నాయి. మిగతా చాలాభాగం ద్వంసం చేసేసారంట. ఒక గదిలో మహలు చుట్టుపక్కల లభ్యమైన రాతిశిల్పాలు, టెర్రకోట బొమ్మలను ప్రదర్శనకై ఉంచారు.
ఇంకొన్ని విశేషాలు:
- బెంగుళూరులోనూ, హైదరాబాదులోనూ ఫుట్‌పాతులపై అమ్మే దొంగ CDలను అమ్మటానికి ఇక్కడ పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి అమ్ముతున్నారు. కొనే ముందు CDలో ఉన్న సినిమా ఎంత క్వాలిటీ ఉందో చూసుకోవటానికి డీవీడీ ప్లేయర్లను కూడా ఏర్పాటు చేసారు!!!
- మధురైలో బాగా ప్రాచుర్యం పొందిన పానీయం "జిగర్ తండా".
- మధురైలో నుండీ 100-150కీమీల దూరంలో మంచి మంచి జలపాతాలు కూడా ఉన్నాయి, కానీ మేము వాటిని చూడలేకపోయాము.




12 వ్యాఖ్యానాలు: